: పాక్ అంగీకరిస్తే రంజాన్ ను పంపేందుకు సిద్ధంగా ఉన్నాం: సుష్మా స్వరాజ్
పాకిస్థాన్ నుంచి ఇండియాకు పారిపోయి వచ్చేసిన రంజాన్ ను తిరిగి పంపించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ, రంజాన్ తల్లితో భారత్ హై కమిషనర్ మాట్లాడారని తెలిపారు. ఆమెకు వీసా కల్పిస్తామని హామీ ఇచ్చినట్టు ఆమె చెప్పారు. కాగా, పాకిస్థాన్ లో సుదీర్ఘ కాలం ఆశ్రయం పొందిన మూగ, బధిర యువతి గీత ఇటీవల స్వదేశం చేరిన సందర్భంగా రంజాన్ ను పాక్ పంపాలనే డిమాండ్ తలెత్తింది. దీనికి సానుకూలంగా ఉన్నట్టు భారత ప్రభుత్వం తెలిపింది. కాగా, పాకిస్థాన్ కు చెందిన రంజాన్ తన తండ్రిని వెతుక్కుంటూ బంగ్లాదేశ్ చేరాడు. అక్కడ తప్పిపోయి, భారత్ చేరుకున్నాడు. రంజాన్ కు మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థ ఆశ్రయం ఇచ్చింది. ప్రస్తుతానికి రంజాన్ అక్కడే ఉన్నాడు. పాకిస్థాన్ అంగీకరిస్తే అతనిని స్వదేశం పంపడానికి ఎలాంటి అభ్యంతరం లేదని కేంద్రం స్పష్టం చేసింది.