: నాడు చంద్రబాబు రాసిన లేఖ... నేడు మాయం!
నాడు ప్రతిపక్ష నేతగా ఉంటూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాసిన లేఖ మాయమైంది. 2011లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు, ఉత్తరాంధ్రలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ, ఓ బహిరంగ లేఖను రాశారు. దాన్ని తెలుగుదేశం పార్టీ అధికార వెబ్ సైటులో ఉంచారు కూడా. తాజాగా బాక్సైట్ అమ్మకాలకు తెరలేపుతూ, బాబు సర్కారు జీవో నంబర్ 97ను జారీ చేయగా, ఆనాటి లేఖను వైకాపా ఇటీవల వెలుగులోకి తెచ్చింది. ఆ వెంటనే అప్పట్లో చంద్రబాబు రాసిన లేఖను వెబ్ సైట్ నుంచి తొలగించారని తెలుస్తోంది. ఇప్పుడా లేఖ టీడీపీ అధికార సైట్లో కనిపించక పోవడం కొత్త చర్చకు తెరలేపింది. మొత్తం 8902 ఎకరాల్లోని 565 మిలియన్ టన్నుల బాక్సైట్ ఖనిజం ఉత్తరాంధ్రలో ఉందన్న లెక్కలుండగా, 3030 ఎకరాల్లో తవ్వకానికి ఏపీ సర్కారు అనుమతించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ విషయంపై బాబు సర్కారును ఇరుకున పెట్టేందుకు వైకాపా సిద్ధమవుతోందని సమాచారం.