: సీబీఐపై ముంబై పోలీసుల్లో పీకల్లోతు కోపం!


ఇండియాకు తీసుకువచ్చిన అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ ను ముంబైకి తరలించకుండా, భద్రతా కారణాల పేరిట డైరెక్టుగా ఢిల్లీకి తీసుకెళ్లడం, ఆపై తమ పరిధిలోని కేసులన్నీ సీబీఐకి అప్పగించడంతో ముంబై పోలీసులు కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజన్ ను ముంబై తెస్తారని, ఎన్నో ఏళ్లుగా తాము సంపాదించి పెట్టుకున్న సాక్ష్యాలతో పదుల కొద్దీ కేసులను పరిష్కరించి, తాము ప్రమోషన్లు కొట్టేయొచ్చని ఆశించిన పలువురు ఉద్యోగులు, కేసులన్నీ సీబీఐ పరిధిలోకి వెళ్లడంతో అవాక్కయ్యారని సమాచారం. వాస్తవానికి బుధవారం సాయంత్రం వరకూ రాజన్ ను ముంబై తెస్తారనే సమాచారం ఉంది. దీంతో ముంబై పోలీసు హెడ్ క్వార్టర్స్ వద్ద భద్రతను మరింతగా పెంచారు కూడా. ఆర్థర్ రోడ్ జైల్లో భద్రత పెంచి, రాజన్ కు ప్రత్యేక బ్యారక్ ను కేటాయించాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఆదేశాలు కూడా జారీ చేశారు. బాలీలో ఆయన విమానం బయలుదేరిందని తెలియగానే, ముంబై పోలీసు కార్యాలయం వద్ద, ఎయిర్ పోర్టు వద్దా మీడియా లైవ్ కెమెరాలతో సిద్ధమైంది. కానీ, ఆయన విమానాన్ని ఎవరికీ తెలియకుండా ఢిల్లీ మళ్లించి, రాజన్ ను సీబీఐ కార్యాలయానికి తరలించారు. ఈ ఘటనలతో తాము పడిన శ్రమ వృథా అవుతుందని ముంబై పోలీసులు విమర్శిస్తున్నారు. కాగా, భద్రతా కారణాల రీత్యా, రాజన్ ను ముంబై బదులు ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News