: కొరుకుడు పడని డివిలియర్స్... మిగతాదంతా సేమ్ టూ సేమ్!
మొహాలీలో ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజున సీన్ రిపీటవుతోంది. తొలి రోజున భారత ఆటగాళ్లు పెవీలియన్ దారి పట్టినట్టే, రెండో రోజు దక్షిణాఫ్రికా ఆటగాళ్లు అవుట్ అవుతున్నారు. ఓపెనర్ ఎల్గర్ (37), ఆమ్లా (43) మినహా మరెవరూ చెప్పుకోతగ్గ స్కోరు చేయకుండానే అవుట్ అయిన వేళ, ఇప్పటివరకూ ఆరు వికెట్లను దక్షిణాఫ్రికా కోల్పోగా, ఎల్గర్, ఆమ్లాలతో పాటు ప్లస్సిస్ (0), వాంజిల్ (5), డీజే విలాస్ (1), ఫిలాండర్ (3) అవుట్ అయ్యారు. విధ్వంసక బ్యాట్స్ మన్ డివిలియర్స్ హాఫ్ సెంచరీ చేసి భారత బౌలర్లకు కొరుకుడు పడకుండా నిలిచి స్కోరును ముందుకు తీసుకెళ్తున్నాడు. మొత్తం 63 బంతులు ఎదుర్కొన్న ఆయన, 6 ఫోర్ల సాయంతో 52 పరుగులు చేశాడు. ఇది డివిలియర్స్ ఖాతాలో 37వ హాఫ్ సెంచరీ. భారత బౌలర్లలో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు తీసి సౌతాఫ్రికా వెన్ను విరిచాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 59 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు.