: బంగ్లాదేశ్ కు విస్తరించేసిన ఐఎస్ఐఎస్!
సిరియా, ఇరాక్ కేంద్రంగా తమ ఉగ్రవాదంతో భయాందోళనలకు గురి చేస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బంగ్లాదేశ్ కు విస్తరించారు. ఓ చెక్ పోస్టుపై దాడి చేసి పోలీసును హతమార్చిన ఘటన వెనుక తామున్నామని ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టు గ్రూప్ ప్రకటించింది. నిత్యమూ బిజీగా ఉండే ఢాకా సరిహద్దుల్లోని ఓ పోలీసు చెక్ పోస్టుపైకి మోటారు బైక్ లపై దూసుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో దాడి చేయగా, ఓ కానిస్టేబుల్ మరణించాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నిన్న జరుగగా, నెల రోజుల వ్యవధిలో ఇటువంటి సంఘటన జరగడం ఇది రెండోసారి. బంగ్లాదేశ్ లో దాడి తమ పనేనని ఐఎస్ఐఎస్ క్లయిమ్ చేసుకుందని 'సైట్' (సెర్చ్ ఫర్ ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఎంటిటీస్) స్పష్టం చేసిందని బంగ్లాదేశ్ వార్తా సంస్థ 'బీడీ న్యూస్ 24' వెల్లడించింది. బంగ్లాదేశ్ అధికారులు మాత్రం ఈ క్లయిమ్ ను ఖండిస్తున్నారు.