: తారాపథానికి తీసుకెళ్తామని చెప్పి రొంపిలో దింపారు!
తండ్రి న్యాయవాది, తల్లి గృహిణి... బీఎస్సీ చదువుతున్నట్టు చెబుతున్న ఆ 21 సంవత్సరాల యువతికి సినిమాల్లో హీరోయిన్ కావాలన్నది కోరిక. అంతవరకూ బాగానే ఉంది. అందుకోసం నడిచిన దారి ఆ యువతిని పాతాళానికి నెట్టింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఓ యువతి నగరంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో విటుల కోసం ఎదురుచూస్తూ పట్టుబడింది. తాను అలాంటిదాన్ని కాదని ఆమె ఎదురు తిరిగినప్పటికీ, పక్కా సాక్ష్యాలతోనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు పలు ఆధారాలు చూపేసరికి 'అవును' అని అంగీకరించింది. తాను గత సంవత్సరం నుంచి నటిగా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చి వెళుతుంటానని పోలీసుల విచారణలో వెల్లడించింది. ఆమెకు పరిచయమైన ఓ సినీ నిర్మాత కారు డ్రైవర్, అవకాశాలు రావాలంటే, కొన్ని వదులుకోవాల్సి వుంటుందని చెప్పి, వ్యభిచారం వృత్తిలోకి దింపాడు. భీమవరం పట్టణానికి చెందిన విజయ్ అనే వ్యక్తితో కలసి రోజుకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష రూపాయలకు ఆమెను బేరానికి పెట్టాడు. ఆన్ లైన్ మాధ్యమంగా విటులను ఆకర్షించి, వారి దగ్గరకు యువతిని తీసుకెళ్లేవాడు. ఎదురు తిరిగితే ముందే తీసి ఉంచిన ఆమె అశ్లీల చిత్రాలను బయటపెడతానని బెదిరించాడు. ఓ కాంట్రాక్టర్ ఆమెను నగరానికి పిలిచి, కొందరు విటులతో బేరం చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులు పరారు కాగా, ఆమెను రెస్క్యూ హోంకు తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్టు వివరించారు.