: విజయం తమదేనంటున్న బీజేపీ... అంత సీను లేదంటున్న నితీష్!
మరో గంటలో బీహార్ లో తుది దశ పోలింగ్ ముగియనుంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగగా, 8వ తేదీన ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. మొత్తం ఐదు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు తమవైపే నిలబడ్డారని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే సమయంలో మహాకూటమి పేరిట బరిలో దిగిన నితీష్, లాలూ తదితర నేతలు సైతం విజయం తమనే వర్తిస్తుందన్న భావనలో ఉన్నారు. చివరి రెండు దశల్లో పోలింగ్ శాతం పెరిగినందున, అది తమకు లాభిస్తుందని, తిరుగులేని విజయానికి మూడు రోజుల దూరంలో ఉన్నామని జేడీయూ అధినేత నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. కాగా, నేడు మధ్యాహ్నం మూడు గంటల సమయానికి పోలింగ్ 55 శాతాన్ని దాటినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సాయంత్రం 5 గంటల వరకూ సమయం ఉండటంతో కనీసం 60 నుంచి 65 శాతం ఓట్లు ఈవీఎంలలో నిక్షిప్తం కావచ్చని అంచనా.