: ఐఎస్ఐఎస్ మరణదండన అమలుకు నిమిషాల ముందు బయటపడిన వేళ..!
ప్రపంచాన్ని తమ దుర్మార్గంతో గడగడలాడిస్తున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చేతులకు దొరికిన ఇరాక్ భద్రతాదళ సభ్యుడు అతను. ఐఎస్ఐఎస్ కోర్టు మరణదండన విధించింది. మరికొన్ని నిమిషాల్లో ఆ శిక్ష అమలు కావాల్సి వుండగా, జరిగిన ఓ ఘటన అతనికి భూమిపై నూకలను మిగిల్చింది. అతని పేరు సయ్యద్ ఖలీఫా అలీ. మొత్తం కథ అతని మాటల్లోనే వింటే... "ఇరాక్ లో పోలీసు అధికారిగా పనిచేస్తుండేవాడిని. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ఎక్కడున్నారో గమనించి వారి స్థావరాల గురించి సైన్యానికి చెప్పడం నా విధి. ఇది ఉగ్రవాదుల దృష్టిలో తీవ్ర నేరం. దీనికి శిక్ష చంపేయడమే. నా దురదృష్టం కొద్దీ పట్టుబడ్డాను. ఆపై చిత్రహింసలు అనుభవించాను. ముఖానికి ప్లాస్టిక్ బ్యాగు కట్టి ఊపిరాడకుండా చేసేవారు. ఆ సమయంలో నా ఇద్దరు భార్యలు, కుమారులే గుర్తుకు వచ్చి మిగతా అంతా అంధకారమయ్యేది. కరెంటు షాకులు పెట్టారు. నీటిలో ముంచేవారు. వారి దృష్టిలో నేను చేసిన నేరాల అభియోగాలను అంగీకరించాను. కళ్లకు గంతలు కట్టి ఓ ఐఎస్ఐఎస్ కోర్టు ముందుకు తీసుకెళ్లగా, నాకు మరణదండన విధించారు" అని సయ్యద్ నెల రోజుల క్రిందటి వరుస ఘటనలను గుర్తు చేసుకున్నాడు. "అక్టోబర్ 22న నా శిక్ష అమలవుతుందని తేదీ చెప్పారు. ఆ ముందు రోజు రాత్రి కూడా హింసించారు. సూర్యోదయాన్ని చూడలేనని నాకు తెలుసు. కానీ ఆ రాత్రి అమెరికా ప్రత్యేక దళాలు, కుర్దూ సైన్యం నేనున్న స్థావరంపై దాడులు జరిపాయి. పదుల కొద్దీ ఉగ్రవాదులను మట్టుబెట్టగా, నాతో పాటు 68 మంది బందీలకు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం లభించింది. నాకింకా బతకాలని రాసిపెట్టి ఉందనుకుంటా" అని అన్నాడు. సయ్యద్ ను ఇంటర్వ్యూ చేసిన వార్తా సంస్థ రాయిటర్స్ అతని కథ మొత్తాన్నీ ప్రత్యేక కథనంగా ప్రచురించింది. ఇంకా సయ్యద్ లాంటి వారు ఎందరో ఉన్నారని తెలిపింది.