: ఖుష్బు - కార్తీల మధ్య మాటల యుద్ధం
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న ఆధిపత్య పోరు, కొనసాగుతున్న విమర్శల జోరు తమిళ తంబిలకు మాంచి వినోదాన్ని అందిస్తోంది. వివరాల్లోకి వెళ్తే, ప్రఖ్యాత సినీ నటి ఖుష్బు, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీల మధ్య విమర్శలు హద్దులు దాటుతున్నాయి. పార్టీ పరంగా ఇది ఇబ్బందికరమైనప్పటికీ, జనాలకు మాత్రం ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ కలిగిస్తోంది. కాంగ్రెస్ పార్టీ సినీ నటులపై ఆధారపడి బతకడం లేదని తొలుత కార్తీ వివాదాన్ని రాజేశారు. దీంతో, ఖుష్బు కార్తీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సినీ నటులపై ఆధారపడి లేదని... కానీ, చిదంబరం, కార్తీలు మాత్రం కాంగ్రెస్ పైనే ఆధారపడి ఉన్నారని సెటైర్ వేశారు. దీనికి కార్తీ సమాధానమిస్తూ, ఖుష్బు పెద్ద నాయకురాలేం కాదని, పార్టీకున్న 60 మంది అధికార ప్రతినిధుల్లో ఆమె కూడా ఒకరని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో, పార్టీ అధ్యక్షుడు ఎలంగోవన్ కల్పించుకుని సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.