: గంగూలీ అప్లికేషన్ పరిశీలనలో ఉందన్న సచిన్
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మధ్య ఆసక్తికర ట్విట్టర్ సంభాషణ సాగింది. చిరకాల మిత్రులైన వీరిద్దరూ సరదా సంభాషణతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అమెరికాలో సచిన్, వార్న్ సారథ్యంలో ఆల్ స్టార్స్ క్రికెట్ టీట్వంటీ సిరీస్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో ప్రపంచ క్రికెట్ ను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో తమవంతు పాత్ర పోషించిన దిగ్గజ క్రికెటర్లు పాలుపంచుకోనున్నారు. ఇందులో 'తనకు ఓపెనర్ గా అవకాశం ఇవ్వాలని, లేని పక్షంలో అమెరికా నుంచి కోల్ కతా వెళ్లే విమానం ఎక్కేస్తాన'ని గంగూలీ సరదాగా సచిన్ కు ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించిన సచిన్ 'దాదా, నీ అప్లికేషన్ పరిశీలనలో ఉంది...అయితే నీ బ్యాటింగ్ ట్రేడ్ మార్క్ షాట్...ఆఫ్ డ్రైవ్ చూడాలని ఉంద'ని ట్వీట్ చేశాడు. వీరిద్దరి ఆసక్తికర సంభాషణ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులను అలరిస్తోంది.