: సిరిసిల్ల అనిల్, సారిక...మధ్యలో ఓ మహిళ: రాజయ్య కుటుంబ కలహాలకు కారణమిదేనా?


ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన సిరిసిల్ల రాజయ్య కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఎదిగారు. గతంలో వరంగల్ లోక్ సభ సభ్యుడిగా ఆయన పనిచేశారు. రాజయ్య ఎంపీగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు సిరిసిల్ల అనిల్ యువజన కాంగ్రెస్ లో కీలకంగా వ్యవహరించారు. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చురుకైన పాత్ర పోషించారు. అంతకుముందు ఇంజినీరింగ్ విద్యనభ్యసిస్తున్న క్రమంలో తన క్లాస్ మెట్ గా ఉన్న సారికతో అనిల్ ప్రేమలో పడ్డారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన సారికను 2006లో అనిల్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సారిక, అనిల్ దంపతులకు ముగ్గురు మగ పిల్లలు జన్మించారు. యువజన కాంగ్రెస్ నేతగా చురుగ్గా వ్యవహరిస్తున్న సమయంలో అనిల్ కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడిందట. ఈ వ్యవహారమే అనిల్, సారికల మధ్య పూడ్చలేనంత అగాధాన్ని సృష్టించిందన్న ప్రచారం సాగుతోంది. అప్పటికే ముగ్గురు పిల్లలు కలగడంతో అనిల్ తో సారిక వేరుపడలేకపోయింది. ఈ క్రమంలో ఆమె విషయాన్ని తన మామ రాజయ్య దృష్టికి తీసుకెళ్లింది. అయితే రాజయ్య దంపతుల నుంచి సారికకు ఆశించినమేర సహకారం అందలేదు. కొడుకునే వెనకేసుకువచ్చిన రాజయ్య దంపతులు సారిక ఫిర్యాదులను అంతగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని నెలల ముందు సారిక తన భర్త అనిల్ తో పాటు రాజయ్య దంపతులపైనా పోలీసులకు సెక్షన్ 498 కింద ఫిర్యాదు చేసింది. తనను, తన పిల్లలను అనిల్ తో పాటు రాజయ్య దంపతులు పట్టించుకోవడం లేదని ఆమె ఆ ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేసింది. ఆ తర్వాత పరిస్థితి కాస్తంత సద్దుమణిగినా, అప్పటికే వేరైన సారిక, అనిల్ లు ఇక కలసివుండలేకపోయారు. మూడంతస్తుల భవంతిలో పై అంతస్తులో రాజయ్య దంపతుల బెడ్ రూం ఉండగా, తొలి అంతస్తులో సారిక తన పిల్లలతో కలిసి ఉంటోంది. ఇక అనిల్ మాత్రం గ్రౌండ్ ఫ్లోర్ లోనే కాలం వెళ్లదీస్తున్నారు. నేటి తెల్లవారుజామున సారిక గదిలోనే అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో పై అంతస్తులో అత్తమామలు, కింది అంతస్తులో భర్త ఉన్నప్పటికీ... సారిక తన ముగ్గురు పిల్లలు సహా అగ్నికి ఆహుతి అయిపోయింది.

  • Loading...

More Telugu News