: గ్యాస్ లీకేజీతోనే ‘సిరిసిల్ల’ ఇంటిలో ప్రమాదం... ఆత్మహత్యాయత్నమేనంటున్న పోలీసులు


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వరంగల్ ఉప ఎన్నికలో ఆ పార్టీ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్య నివాసంలో నేటి తెల్లవారుజామున చోటుచేసుకున్న దుర్ఘటనకు గ్యాస్ లీకేజీ కారణమని పోలీసులు నిర్ధారించారు. భనవం మొదటి అంతస్తులో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లలు సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే వరంగల్ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సహా పోలీసు అధికారులు అక్కడికి వచ్చారు. మంటలు చెలరేగిన గదిని పరిశీలించిన పోలీసులు గ్యాస్ లీకేజీ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఆత్మహత్యాయత్నంలో భాగంగా సారికనే గ్యాస్ లీక్ చేసిందా? లేక ప్రమాదవశాత్తు గ్యాస్ లీకైందా? అన్న విషయం తెలియరాలేదు. క్లూస్ టీంను రంగంలోకి దింపిన పోలీసులు ఈ విషయాన్ని నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే, సారిక ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలోనూ సారిక రెండుసార్లు ఆత్మహత్యాయత్నం చేసిన వైనాన్ని వారు గుర్తు చేస్తున్నారు. అయితే ఆత్మహత్యాయత్నం చేసినట్లుగా ఇప్పటిదాకా స్పష్టమైన ఆధారాలేమీ లభించని కారణంగా దీనిపై పోలీసులు ప్రకటన చేయలేదు.

  • Loading...

More Telugu News