: భావోద్వేగాలను రెచ్చగొడుతున్న చంద్రబాబు: వైఎస్ జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలను ఒకేలా చూడటం లేదని, భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అభివృద్ధి అనేది అన్ని జిల్లాలకు విస్తరించాలన్నారు. కడపలోని సింహాద్రిపురం మండలంలో ఉన్న పైడిపాలెం ప్రాజెక్టును ఆయన సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు బాబు అన్యాయం చేస్తున్నారంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని అభివృద్ధికి తాము అడ్డుకాదన్నారు. హైదరాబాద్ చుట్టూనే అభివృద్ధి మొత్తాన్ని కేంద్రీకృతం చేయడం కారణంగానే ఉద్యమాలు జరిగాయని, అటువంటి సంఘటనలు నవ్యాంధ్ర రాష్ట్రంలో జరగకుండా ఉండేలా చూడాలన్నారు. అందుకోసం రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించాలని సూచించారు. కరవు మండలాల ప్రకటనలో చంద్రబాబు పక్షపాత ధోరణి స్పష్టంగా కన్పించిందని జగన్ ఆరోపించారు. పులివెందుల నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక్క మండలాన్నే కరవు మండలంగా ప్రకటించారన్నారు. ఇంకా శ్రీశైలం నుంచి కిందికి నీరు విడుదల చేయడం, పద్మావతి మెడికల్ కళాశాల సీట్లు మొదలైన విషయాలపై జగన్ మాట్లాడారు.