: లాలూ 250, నితీష్ 200, నరేంద్ర మోదీ 25 సభలు మాత్రమే!
బీహారులో ఎన్నికలు తుది దశకు వచ్చిన వేళ లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ ల సభల స్కోరు 200 దాటేస్తే, ప్రధాని నరేంద్ర మోదీ 25కు మాత్రమే పరిమితమయ్యారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పటికే 250 ర్యాలీల్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి హోదాలో నితీష్ సైతం 200కు పైగా ప్రసంగాలు చేశారు. నేటితో ఆఖరి దశ పోలింగ్ కు ప్రచారం ముగియనున్న వేళ, ఈ ఇద్దరూ సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజలకు కనపడాలని మంగళవారం సైతం సుడిగాలి పర్యటనలో నిమగ్నమయ్యారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకూ 25 చోట్ల మాత్రమే ప్రసంగం నిర్వహించగా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 15 సభలకు, సోనియా 6 సభలకు మాత్రమే పరిమితమయ్యారు. బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ప్రధాన పోటీదారులుగా ఉన్న సుశీల్ కుమార్ మోదీ 200 కన్నా కాస్త తక్కువగాను, జితన్ రామ్ మాంజీ 150కి పైగా ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లోను పాల్గొన్నారు. ఎన్డీయే నేతల్లో అమిత్ షా, రామ్ విలాస్ పాశ్వాన్ తదితరులు 100 వరకూ ర్యాలీల్లో పాల్గొన్నారు.