: సంక్రాంతికి అమెరికాలో కీరవాణి అండ్ టీమ్ మ్యూజికల్ నైట్
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కీరవాణి అమెరికాలో ఉండే తెలుగువారిని అలరించబోతున్నారు. జనవరి 13, 2016 నుంచి జనవరి 30వ తేదీ వరకు అక్కడ పలు ప్రాంతాల్లో తన టీంతో కలసి ఆయన ప్రదర్శనలు ఇవ్వనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించి ప్రదర్శనలకు సంబంధించిన విషయాలను కీరవాణి తెలిపారు. గతంలో రెండు సార్లు న్యాట్స్ వారి ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లి ప్రదర్శనలిచ్చామన్నారు. అదే విధంగా ఇప్పుడు సథరన్ కాన్సెప్ట్, ఐఎన్ సి సంస్థ అహ్వానం మేరకు జనవరిలో యూఎస్ వెళ్లనున్నట్టు వెల్లడించారు. అక్కడ తాము నిర్వహించే మ్యూజికల్ నైట్స్ లో కొత్త, పాత పాటలను మిక్స్ చేసి పాడనున్నామని చెప్పారు. అందులో తమకు ఇష్టమైన పాటలను వినాలనుకునే వారు ఇనగంటి సుందర్ ('బాహుబలి' చిత్రంలో మూడు పాటలు రాశారు) కు ట్విట్టర్ ద్వారా తెలియజేయాలని కీరవాణి వివరించారు. ఇక తాను కంపోజ్ చేసిన పాటలతో పాటు చక్రవర్తి, ఇళయరాజా వంటి వారు కంపోజ్ చేసిన పాటలు కూడా వినిపిస్తామని తెలిపారు. ఈ మ్యూజికల్ నైట్స్ లో కీరవాణితో పాటు రచయిత అనంత శ్రీరాం, గాయకులు గీతామాధురి, రేవంత్ తదితరులు పాల్గొంటారు.