: లాలూ ‘డబుల్ సెంచరీ’ కొట్టేశారు!
నిజమే, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ డబుల్ సెంచరీ కొట్టేశారు. రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్న లాలూ క్రికెట్ మైదానంలో ఎప్పుడు దిగారనుకుంటున్నారా? లాలూ డబుల్ సెంచరీ కొట్టింది క్రికెట్ పిచ్ పై కాదు, బీహార్ ఎన్నికల బరిలో. బీజేపీకి ఎలాగైనా షాకివ్వాలని నిర్ణయించుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ ప్రస్తుతం బీహార్ లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత వారానికే 200 ర్యాలీల్లో తనదైన శైలిలో ప్రసంగాలు చేశారు. ఇప్పటిదాకా ఐదు విడతల పోలింగ్ లో నాలుగు విడతలు పూర్తి కాగా, ఐదో విడత పోలింగ్ జరగనున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముమ్మరంగా ప్రచారం సాగుతోంది. గత వారానికే 200 ప్రసంగాలు చేసిన లాలూ, ఎన్నికల ప్రచారం ముగిసే నాటికి 250 ప్రసంగాలు చేసే అవకాశాలు లేకపోలేదన్న వాదన వినిపిస్తోంది. 200 ప్రసంగాలతోనే రికార్డులకు ఎక్కనున్న లాలూ... 250 ప్రసంగాలు చేస్తే, భవిష్యత్తులో ఆయన రికార్డును ఏ ఒక్కరూ అధిగమించే పరిస్థితి ఉండదన్న విశ్లేషణలు సాగుతున్నాయి.