: ఆంధ్రా వర్సిటీలో మంత్రి గంటా తనిఖీలు... ర్యాగింగ్ పై విద్యార్థినులతో ఆరా
విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో వెలుగుచూసిన ర్యాగింగ్ ఘటనపై ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వేగంగా స్పందించారు. వర్సిటీలోని ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఉమెన్స్ హాస్టల్ లో జరుగుతున్న ర్యాగింగ్ పై ఓ విద్యార్థిని తండ్రి వర్సీటీ అధికారులను అప్రమత్తం చేశారు. దీంతో వెనువెంటనే రంగంలోకి దిగిన వర్సిటి రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న మంత్రి గంటా కొద్దిసేపటి క్రితం నేరుగా వర్సిటీకి వెళ్లారు. ర్యాగింగ్ ఘటన వెలుగుచూసిన ఉమెన్స్ హాస్టల్ లో ఆయన తనిఖీలు చేశారు. అంతేకాక అక్కడి విద్యార్థినులతో మాట కలిపిన మంత్రి ర్యాగింగ్ పై వివరాలు సేకరించారు. నిందితులపై చర్యల దిశగా మంత్రి వర్సిటీ అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు సమాచారం.