: 58 ఏళ్ల వయసులో 'స్టార్' అయి, ఆపై 11 ఏళ్లకే...!
అప్పటికే నాటక రంగంలో రెండు నంది అవార్డులు సహా 378 చిన్నా చితకా అవార్డులు పొందిన పేరున్న రంగస్థల నటుడాయన. 58 ఏళ్ల వయసులో ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంలో "నేనొప్పుకోను... ఐతే ఓకే" అన్న ఒకే డైలాగుతో తెలుగు సినీ ప్రేక్షకుల హృదయాలలో స్థిరపడిపోయారు కొండవలస లక్ష్మణరావు. పదవీ విరమణ చేసి ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో ఆయనకు స్టార్ డమ్ వచ్చింది. 11 సంవత్సరాల వ్యవధిలో 300కు పైగా సినిమాలు చేశారు. తొలి సినిమా విడుదలైన తరువాత ఆయన ఖాళీగా ఇంట్లో కూర్చున్న రోజులు వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. సంవత్సరంలో 80 తెలుగు చిత్రాలు విడుదలైతే, అందులో 40 వరకూ కొండవలస నటించినవి ఉన్న సందర్భాలూ ఉన్నాయి. తెలుగు సినీ హాస్య ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన కొండవలస మరణం సినీ కళామతల్లికి తీరనిలోటని చలన చిత్ర ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. "ఐతే ఓకే" అంటూ సినీ ప్రేక్షకులకు దగ్గరైన కొండవలస ఇలా చెప్పాపెట్టకుండా దూరం కావడం "నాట్ ఓకే" అంటున్నారు అభిమానులు.