: మోదీ మౌనానికి... అరుణ్ శౌరీ కారణం చెప్పేశారు!
గొడ్డు మాంసం వండాడన్న కారణంతో ఉత్తరప్రదేశ్ లోని దాద్రిలో అఖ్లాక్ అనే ముస్లిం వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు తెరలేవడమే కాక కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శల జడివాన కూడా కురుస్తోంది. ఈ నేపథ్యంలో విపక్షాల ఆరోపణలపై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా తరచూ సంచలన ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ ఘటనపై ప్రధాని నోరు విప్పిన దాఖలా లేదు. ప్రధాని మోదీ మౌనం వీడాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా మిగతా విపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. అయితే మోదీ మాత్రం నోరు విప్పట్లేదు. దీని వెనుక ఉన్న కారణాన్ని బీజేపీ మాజీ నేత, ప్రముఖ జర్నలిస్ట్ అరుణ్ శౌరీ కనిపెట్టేశారు. గతంలో బీజేపీకి అత్యంత సన్నిహితంగా ఉన్న శౌరీ, ఇటీవల పార్టీకి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో నిన్న న్యూఢిల్లీలో ‘ఇండియా టుడే’తో మాట్లాడిన సందర్భంగా ఆయన ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు. బీహార్ లో జరుగుతున్న ఎన్నికల్లో విజయం సాధించేందుకే నరేంద్ర మోదీ నోరు విప్పడం లేదని ఆయన తేల్చిచెప్పారు. దాద్రి లాంటి ఘటనలపై నిరసనలు వ్యక్తం చేసిన రచయితలను ఈ సందర్భంగా శౌరీ కీర్తించారు.