: దెయ్యాలు రాలేదుగానీ, తిట్లు మిగిలాయి!


గత వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా ఆకర్షించిన వార్త. దెయ్యాలున్నాయని ఎందరినో నమ్మించి, అత్యంత భయానక గృహంగా చరిత్రలో నిలిచిపోయిన ఇంట్లోకి వెళ్లి, దెయ్యాలను పిలుస్తామని ఓ యూఎస్ టెలివిజన్ చానల్ ప్రకటించడంతో, టీవీ ప్రేక్షకులు ఆసక్తి చూపారు. మొత్తం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీలో చూపుతామని 'డెస్టినేషన్ అమెరికా' భారీ ప్రచారం చేపడితే నమ్మేశారు. వీరు భూతాలను పిలుద్దామని అనుకుంటూ వెళ్లనున్న బంగ్లాలో 'వరల్డ్స్ స్కేరెస్ట్ మూవీస్'లో ఒకటైన 'ది ఎగ్జార్సిస్ట్' చిత్రీకరణ జరిపివుండటం, అక్కడ గతంలో హత్యలు, చేతబడులు జరిగాయన్న వదంతులు ఉండటంతో, లైవ్ మొదలయ్యే సమయానికి లక్షలాది మంది టీవీలకు అతుక్కు పోయారు. కార్యక్రమం మొదలైంది. బిషప్ జేమ్స్ లాంగ్, చిప్ కొఫీ తదితరులు ఆ గృహంలోకి ప్రవేశించారు. బిషప్ ఓ చేతిలో శిలువపై ఉన్న జీసస్ ప్రతిమను పట్టుకోగా, కోఫీ దెయ్యాలను ఆహ్వానిస్తూ, మంత్రాలు మొదలు పెట్టాడు. వీరిద్దరూ అక్కడుండి దెయ్యాలను పిలుస్తుండగానే, ఇంటి అడుగు భాగానికి మిగతా టీం సభ్యులు క్రిస్, డూగీ, పోర్టర్, బ్రానన్, చాసీ రే తదితరులు వెళ్లారు. కింది గదుల్లో నరకానికి దారుల్లాంటి తలుపులు ఉన్నాయని, వాటిల్లోకి వెళితే అంతే సంగతులని హెచ్చరించారు కూడా. వీరంతా కిందకు వెళ్లి, సంప్రదాయ పద్ధతుల్లో భూతాలను ఆహ్వానించారు. మొత్తం రెండు గంటలకు పైగా ఈ తతంగం సాగగా, గదుల్లో ముందుగానే అమర్చిన కెమెరాల ద్వారా లైవ్ కొనసాగింది. కార్యక్రమం మొదట్లో ఆసక్తిగా తిలకించిన ప్రేక్షకులు సమయం గడిచే కొద్దీ అసహనానికి గురయ్యారు. అంతే, ఇక సామాజిక మాధ్యమాల్లో విమర్శల పర్వం మొదలైంది. లైవ్ కార్యక్రమం ముగిసి ఎటువంటి దెయ్యాలు రాలేదన్న ప్రకటన వెలువడిన తరువాత విమర్శలు తిట్ల రూపంలోకి మారాయి. తమ సమయాన్ని వృథా చేశారని, ఈ కార్యక్రమం చూసి గుండె బరువైందని ఎవరైనా భావిస్తే, అది షర్ట్ గుండీల వల్లేనని తెలుసుకొమ్మని, పిచ్చి పబ్లిసిటీ కోసమే ఈ కార్యక్రమాన్ని పెట్టారని... ఇలా వందలాది మంది 'డెస్టినేషన్ అమెరికా'పై విరుచుకుపడ్డారు.

  • Loading...

More Telugu News