: ఐసీసీ పదవీ పాయే?... శ్రీనికి చెక్ పెట్టే దిశగా బీసీసీఐ అడుగులు!


భారత క్రికెట్ కంట్రోల్ బోర్డును సుదీర్ఘకాలం పాటు తన చెప్పుచేతల్లో పెట్టుకుని ప్రపంచ క్రికెట్ లో చక్రం తిప్పిన ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్.శ్రీనివాసన్ కు మరింత గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయి. ఐపీఎల్ లో ఆయన వ్యాపార సామ్రాజ్యం ఇండియా సిమెంట్స్ ఆధ్వర్యంలోని జట్టు చెన్నై సూపర్ కింగ్స్, స్పాట్ ఫిక్సింగ్ లో అల్లుడు గురునాథ్ మెయెప్పన్ ప్రమేయంతో అప్పటిదాకా వెలిగిపోయిన శ్రీని ప్రతిష్ఠ క్రమంగా మసకబారింది. సాక్షాత్తు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలతో బీసీసీఐ పగ్గాలను శ్రీని వదులుకోక తప్పలేదు. బీసీసీఐ బోర్డు మీటింగుల్లోకి కూడా ప్రవేశం లేని శ్రీని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)లో మాత్రం తన హవా కొనసాగిస్తున్నాడు. బీసీసీఐలో స్థానం కోల్పోయిన శ్రీని, ఐసీసీ చైర్మన్ గా ఇప్పటికీ డాబూ దర్పం వెలగబెడుతున్నారు. అయితే దీనిపై బీసీసీఐ కొత్త అధ్యక్షుడు శశాంక్ మనోహర్, కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ దృష్టి సారించారట. 2014లో రెండేళ్ల పదవీ కాలానికి ఐసీసీ చైర్మన్ గా శ్రీని ఎంపికయ్యారు. అంటే, వచ్చే ఏడాది దాకా ఆయన పదవీ కాలం ఉంది. అయితే ఈ పదవిని ఆయన బీసీసీఐ ప్రతినిధి హోదాలోనే చేజిక్కించుకున్నారు. దీనినే అస్త్రంగా చేసుకుని శ్రీనిని ఐసీసీ నుంచి కూడా బయటకు పంపేందుకు సన్నాహాలు మొదలైనట్లు సమాచారం. ఐసీసీలో తన ప్రతినిధిని మారుస్తూ బీసీసీఐ ఏకగ్రీవ తీర్మానం చేస్తే, శ్రీని ఐసీసీ చైర్మన్ పదవి నుంచి తప్పుకోకతప్పదు. ఈ దిశగా శశాంక్, ఠాకూర్ లు వేగంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ నెల 9న జరగనున్న బీసీసీఐ భేటీలో ఈ మేరకు వారు తమ ప్రణాళికను అమలు చేసేందుకు దాదాపుగా సిద్ధమయ్యారని వినికిడి. ఇదే జరిగితే, శ్రీని శకం దాదాపుగా ముసిగినట్టే.

  • Loading...

More Telugu News