: మా ప్రేమ ఎలా మొదలైందంటే...: మధుప్రియ దంపతులు
"ఆడపిల్లనమ్మా..." అంటూ పాటలు పాడి తెలుగు ప్రజలకు సుపరిచితమైన మధుప్రియ, సంచలన రీతిలో తన ప్రియుడు శ్రీకాంత్ ను కాగజ్ నగర్ లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై ఇవాళ ఓ టీవీ చానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, తమ మధ్య ప్రేమ ఎలా మొదలైందన్న విషయమై నవ దంపతులు మనసువిప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ, "మా టీవీలో పాటలు పాడుతున్నప్పటి నుంచి మధుప్రియ తెలుసు. నిజం చెప్పాలంటే, నేను ఆమెకు వీరాభిమానిని. మా ఇంటి దగ్గరే ఉండటం, నిత్యమూ చూస్తుండటంతో ప్రేమ కలిగింది. తను నాకు పరిచయము, అది ప్రేమగా మారి ఇన్ని కొట్లాటల మధ్య పెళ్లి జరుగుతుందని అనుకోలేదు" అని చెప్పుకొచ్చాడు. ఇదే విషయమై మధుప్రియ మాట్లాడుతూ, "మేము నల్లకుంటలో ఉన్నప్పటి నుంచి శ్రీకాంత్ పరిచయమే. నేను నిత్యమూ స్కూటీపై శ్రీకాంత్ ఇంటి ముందు నుంచే వెళుతుండేదాన్ని. ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని వెళుతుంటే, తను ఇంటి ముందు నిలబడి ఆసక్తిగా చూస్తుండేవాడు. ఆపై కొద్ది రోజులకు నాకు ప్రపోజ్ చేశాడు. నేను రెండేళ్లు దగ్గరగా గమనించి, మంచి లక్షణాలున్నాయని తెలుసుకున్నాకే ఓకే చెప్పాను. తన దగ్గర ఏదున్నా లేకపోయినా, సాయం కోరి వస్తే కాదనడు. ఏదో ఒకటి ఇవ్వాలనే చూస్తాడు. తన గురించి ఆలోచించుకోని హెల్పింగ్ నేచర్ నన్నెంతో ఆకర్షించింది. ఓ అబ్బాయి ఇలా ఉంటాడా అనిపించేది. నాకోసం ఎంతో చేశాడు. నా గురించి మరెవరూ పడని కష్టాలు పడ్డాడు. ఎన్ని దెబ్బలు తినాలో అన్ని దెబ్బలు తిన్నాడు. ఎన్నో మంచి లక్షణాలున్నాయి. నాకు బాధగా ఉంటే నాకన్నా ఎక్కువ బాధపడతాడు. అందుకే శ్రీకాంత్ అంటే నాకెంతో ఇష్టం పెరిగింది" అని తెలిపింది.