: తండ్రి మరణం... బాధను దిగమింగి బరిలోకి దిగిన ఆంధ్రా యువ క్రికెటర్


ఓవైపు కన్న తండ్రి మరణించిన బాధ. మరోవైపు ఆంధ్రా జట్టు తరఫున పంజాబ్ లో మ్యాచ్ ఆడాలి. తండ్రి అంత్యక్రియలు ముగిసీ ముగియగానే జట్టుకు తన సేవలు అందించాలన్న కోరిక ఆ యువ క్రికెటర్ ను పాటియాలాకు నడిపించింది. అనంతపురంకు చెందిన బెంజిమన్ ప్రశాంత్ కుమార్ ఏపీ రంజీ జట్టులో ఓపెనర్ గా రాణిస్తూ, భారత జట్టులో స్థానం కోసం కలలు కంటున్నాడు. పంజాబ్ తో ఆడాల్సిన మ్యాచ్ మరో రోజులో మొదలవుతుందనగా, తండ్రి మరణించాడన్న విషాదవార్త తెలిసింది. చివరి చూపుల కోసం అనంత వచ్చిన ఆ యువ క్రికెటర్, బంధువులు వారిస్తున్నా వినకుండా ప్రయాణమై, ఒక్కరోజులో తిరిగి జట్టులో చేరిపోయాడు. ఆ మ్యాచ్ లో ఆంధ్రా జట్టు 80 పరుగులకే కుప్పకూలగా, ప్రశాంత్ 33 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతేకాదు, కీలకమైన 4 వికెట్లు తీసి పంజాబ్ జట్టు 147 పరుగులకు ఆలౌట్ కావడంలో తన వంతు బాధ్యత నిర్వర్తించాడు. తండ్రి మరణంతో బాధగా ఉన్నా, పంజాబ్ తో జరిగే మ్యాచ్ లో తాను ఉండాలని భావించానని, మరణం విషయంలో ఏమీ చేయలేమని, బాధను దిగమింగి ముందుకు సాగాలని భావించానని ప్రశాంత్ చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News