: సమస్యలు వస్తే కళ్లకు పని పెట్టండి!
సమస్యలు అందరికీ వస్తాయి. ఏదైనా సమస్య వస్తే, దాని పరిష్కారం కోసం మనసులోనే బాధపడకుండా, ఎదుటి వారికి అంటే కుటుంబ సభ్యులు, స్నేహితులు, మేలు కోరేవారు ఎవరికైనా చెప్పుకోవాలి. ఇతరులతో చర్చించడం వల్ల సమస్యకు పరిష్కారం సులువుగా లభిస్తుంది. ఈ దిశలో భావ వ్యక్తీకరణ ఎంతో ముఖ్యం. విషయం చెబుతున్నప్పుడు కళ్లకు పని పెట్టాలి. మన కంటే ముందు మన కళ్లు సగం విషయాన్ని చెప్పేస్తాయని గుర్తుంచుకోవాలి. చెప్పేది నిజమా? అబద్ధమా? అన్నది కూడా కళ్లలో కనిపిస్తుంది. ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు... * ఎవరూ మీ సమస్యను స్వయంగా తెలుసుకుని దానికి పరిష్కారాన్ని చూపరు. మీరే దానికి పరిష్కారం వెతకాలి. ఈ దిశగా దాన్ని ఇతరులతో చర్చించాలి. * సమాచార వ్యవస్థ విస్తరించిన వేళ, మొబైల్ మాధ్యమంగా ఎస్ఎంఎస్ లు, ఈ మెయిల్స్ రూపంలో సమస్యను ఎదుటివారికి చెప్పుకోవడం సులభమే అయినప్పటికీ, వారికి మీ మనసు కూడా అర్థం కావాలంటే, ప్రత్యక్షంగా చర్చించుకోవడమే మేలు. దీనివల్ల మరింత వేగంగా సమస్య దూరమవుతుంది. * ఎక్కడో చూస్తూ, మాట్లాడకుండా, కళ్లల్లో కళ్లు పెట్టి చెప్పాలనుకున్నది చెబితే, ఎదుటివారు శ్రద్ధగా విన్నారా? లేదా? అన్నది తెలుస్తుంది. ఓ సమస్యను మనసు పెట్టి వింటున్నారా? అన్న విషయం తెలుసుకోవచ్చు. సమస్యకు పరిష్కారం దిశగా అవతలి వైపు నుంచి ఓ సమాధానం వచ్చిందంటే, దాన్ని శ్రద్ధగా విన్నట్టే. * కళ్లలో నిజాయతీ కనిపించాలి. అవతలి వ్యక్తి మీకు ఇబ్బందులు కలిగిస్తున్న సమస్యను అతనితోనే చర్చించాలని భావిస్తే, 'నువ్వు' బదులు 'నేను' అని మొదలు పెట్టడం ఉత్తమం. 'నువ్వు ఆ తప్పు చేశావు' అని చెప్పే బదులు 'నేను ఆ పని వల్ల చాలా ఇబ్బంది పడ్డాను' అని ప్రారంభిస్తే, ఎదుటివారు మీపై ఆదిలోనే సానుకూల ధోరణిలోకి వచ్చేస్తారు.