: తండ్రికే తండ్రయిన ఏడేళ్ల బాలుడు...గుండెలు పిండేసే వ్యథ!
ఓపక్క మంచానపడ్డ తండ్రికి వైద్యం చేయించాల్సిన భారం, మరోపక్క కుటుంబాన్ని పోషించాల్సిన భారం ఎవరికైనా ఏడేళ్ల వయసుకే పడితే...ఆ జీవితం కష్టాల కడలి అనడంలో అతిశయోక్తి లేదు. కానీ, ఇంతటి పెను భారాన్ని ఓ ఏడేళ్ల బాలుడు నవ్వుతూ మోసేస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే... చైనాలోని గిజువా ప్రావిన్స్ కు చెందిన ఏడేళ్ల బాలుడు యాంగ్ ఓ యాంగ్లిన్ తండ్రి 2013లో తమ ఇంటి రెండవ అంతస్తు నుంచి కిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. ఆయన వెన్నెముకకు తీవ్ర గాయం కావడంతో పక్షవాతం వచ్చింది. పర్యవసానంగా అతను మంచానికే పరిమితమయ్యాడు. దీంతో అప్పటి వరకు సంపాదించిన మొత్తం హరించుకుపోయింది. దీంతో, ఆయన భార్య మూడేళ్ల పాపను తీసుకుని ఇల్లు విడిచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి పక్షవాతంతో బాధపడుతున్న తండ్రికి అన్నీ కొడుకే అయ్యాడు. ఏడేళ్ల యాంగ్లిన్ దినచర్య ఉదయం ఆరు గంటలకే ప్రారంభమవుతుంది. నిద్రలేచి వంట చేసి, తండ్రికి భోజనం తినిపించి, స్కూలుకి వెళ్తాడు. మధ్యాహ్నం స్కూలు నుంచి వచ్చి, తండ్రికి భోజనం తినిపించి, చెత్త ఏరేందుకు వెళ్తాడు. సాయంత్రం వరకు చెత్త ఏరి, అలా సంపాదించగా వచ్చిన డబ్బులు తీసుకుని ఇంటికి వస్తాడు. మళ్లీ వంట చేసి, తండ్రికి భోజనం తినిపించి, దెబ్బతిన్న వెన్నెముకకు ఆయిల్ తో మర్దనా చేసి, హోం వర్క్ పూర్తి చేసుకుని నిద్రకు ఉపక్రమిస్తాడు. చెత్త ఏరగా వచ్చిన డబ్బులతో తండ్రి, వైద్యం, కుటుంబ పోషణ చేస్తూ యాంగ్లిన్ సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు. కుమారుడి బాధను చూడలేక యాంగ్లిన్ తండ్రి ఆత్మహత్య చేసుకుందామని భావించాడు. అయితే ఏదో ఒకరోజు మరణించాల్సిందేనని, అంత వరకు చిన్నారి తండ్రికి తోడుగా ఉండాలని, కుమారుడ్ని ఒంటరిని చేయలేక ఆ ప్రయత్నాన్ని విరమించాడు. బతకడం భారమైనా పంటిబిగువున ఆ బాధను భరిస్తున్నాడు!