: జాతీయగీతాన్ని మధ్యలోనే ఆపేయమంటూ వివాదానికి ఆజ్యం పోసిన గవర్నర్
ఉత్తరప్రదేశ్ గవర్నర్ రామ్ నాయక్ సరికొత్త వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. జాతీయగీతం 'జనగణమన'ను ఆలపిస్తుండగా మధ్యలోనే ఆపేయాలంటూ ఆయన ఆదేశించారు. ఈ ఘటన ఈ రోజు అఖిలేష్ సింగ్ ప్రభుత్వంలో కొత్తగా 12 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేసిన అనంతరం చోటుచేసుకుంది. రాజ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రుల ప్రమాణస్వీకారం అనంతరం కార్యక్రమాన్ని ముగించేందుకు జాతీయగీతాలాపన ప్రారంభమైంది. అయితే, సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినం సందర్భంగా జాతీయ ఐక్యతకు సంబంధించిన ప్రతిజ్ఞ చేయించాలని రామ్ నాయక్ భావించారు. జాతీయగీతం పూర్తయితే కార్యక్రమం ముగిసిపోతుందనే భావనలో... జాతీయగీతాన్ని మధ్యలోనే ఆపమని సంజ్ఞ చేయడమే కాక, నోటితో కూడా ఆదేశించారు. దీంతో, జాతీయగీతాలాపన మధ్యలోనే ఆగిపోయింది. దీంతో, ఒక్కసారిగా గవర్నర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. రామ్ నాయక్ తన చర్యలతో జాతీయగీతాన్ని అవమానపరిచారని పలువురు మండిపడుతున్నారు. మరోవైపు, రామ్ నాయక్ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అయితే, చిన్న పొరపాటు వల్లే ఇది జరిగిందని రాజ్ భవన్ వర్గాలు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాయి.