: జీహెచ్ఎంసీలో 25 లక్షల ఓట్ల తొలగింపు?...మరికాసేపట్లో కేంద్ర బృందం కీలక భేటీ


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో ఓట్ల తొలగింపునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు ఊపందుకుంది. నిన్న ఉదయమే పశ్చిమ బెంగాల్ కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి సునీల్ గుప్తా నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధి బృందం జీహెచ్ఎంసీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా ఓట్ల తొలగింపునకు సంబంధించి జీహెచ్ఎంసీ అనుసరించిన వైఖరిపై సదరు బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రేటర్ పరిధిలో ఇప్పటిదాకా 25 లక్షల ఓట్ల దాకా గల్లంతైనట్లు ఆ బృందం అనుమానిస్తోంది. దీంతో ఈ విషయంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టాలని నిర్ణయించిన బృందం మరికాసేపట్లో తెలంగాణలోని విపక్షాలతో ప్రత్యేకంగా భేటీ కానుంది. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో జగరనున్న ఈ భేటీకి విపక్షాలన్నీ తమ వద్ద ఉన్న ఆధారాలతో సహా హాజరయ్యేందుకు సిద్ధపడుతున్నాయి. విపక్షాల ఫిర్యాదులను, ఆయా పార్టీల నేతలందించే ఆధారాలను సమగ్రంగా పరిశీలించనున్న బృందం సభ్యులు జీహెచ్ఎంసీ పరిధిలో గల్లంతైన ఓట్ల సంఖ్యను నిర్ధారించనుంది. ఓట్ల తొలగింపునకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా ఆ బృందం ప్రభుత్వానికి సూచనలు చేసే అవకాశాలున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఈ భేటీని సద్వినియోగం చేసుకోవాలని విపక్షాలన్నీ సన్నాహాలు చేస్తున్నాయి. మరోవైపు ఈ సమస్య నుంచి సులువుగా గట్టెక్కడమెలాగా? అన్న కోణంలో అధికార పక్షం యోచిస్తోంది.

  • Loading...

More Telugu News