: పూరి గుడిసెలో చంద్రబాబు... నెల్లూరు పేద కుటుంబంతో మాటామంతీ
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి ఉదయం నెల్లూరు నగరంలో నాలుగు గంటలకు పైగా వీధుల్లో సుడిగాలి పర్యటన చేశారు. తెల్లవారక ముందే బయటకు వచ్చిన చంద్రబాబు నగరంలోని పలు వీధుల్లో పారిశుద్ధ్యంపై పరిశీలన జరిపారు. రోడ్డుపై నిలబడి కొబ్బరి బోండాం తాగారు. ఆ తర్వాత నగరంలోని ఓ పూరి గుడిసెలోకి ప్రవేశించారు. ఆ గుడిసె తలుపు ఎత్తు తక్కువగా ఉండటంతో వంగి మరీ ఇంటిలోకి ప్రవేశించిన చంద్రబాబు అందులోని పేద కుటుంబంతో మాట కలిపారు. కుటుంబ పరిస్థితులపై ఆరా తీసిన బాబు, పేద దంపతుల పిల్లల విద్యాభ్యాసం గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలను బాగా చదివించాలని దంపతులకు చెప్పి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఊహించని విధంగా చంద్రబాబు తమ ఇంటిలోకి అడుగుపెట్టడంతో ఆ పేద కుటుంబం ఉబ్బితబ్బిబ్బైంది.