: పొద్దున్నే నెల్లూరు రోడ్లపైకి వచ్చిన చంద్రబాబు...పారిశుద్ధ్యంపై అధికారులకు హెచ్చరికలు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేటి ఉదయం తెల్లవారకముందే నెల్లూరులో ఆకస్మిక తనిఖీలకు బయలుదేరారు. నిన్న నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లిన చంద్రబాబు రాత్రి మంత్రి నారాయణ కూతురు వివాహ వేడుకకు హాజరయ్యారు. ఆ తర్వాత నెల్లూరులోనే రాత్రి బస చేసిన ఆయన నేటి ఉదయం సూర్యుడు ఉదయించకముందే నగరంలోని రోడ్లపై ప్రత్యక్షమయ్యారు. నగరంలోని బ్రహ్మానందపురంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా అక్కడి పారిశుద్ధ్యంపై దృష్టి సారించిన చంద్రబాబు కార్పొరేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం మెరుగుపడకపోతే చర్యలు తప్పవని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. పొద్దున్నే చంద్రబాబు ఆకస్మిక తనిఖీలకు బయలుదేరడంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు.