: విచారణకు మారన్ సహకరించట్లేదట....అరెస్ట్ కు అనుమతించాలని సుప్రీంలో సీబీఐ పిటిషన్
టెలికాం కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా ఉన్న డీఎంకే సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్ సీబీఐ విచారణకు ఏమాత్రం సహకరించడం లేదట. విచారణలో భాగంగా దయానిధి మారన్ అసలు నోరు విప్పడం లేదట. ఈ మేరకు సాక్షాత్తు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు ముందుకు సాగాలంటే దయానిధి మారన్ నోరు విప్పాల్సిందేనని, మారన్ నోరు విప్పాలంటే అరెస్ట్ చేయాల్సిందేనని కూడా సీబీఐ అధికారులు సుప్రీంకోర్టులో వాదించారు. ఈ మేరకు నిన్న సీబీఐ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు, స్పందన తెలియజేయాలని మారన్ కు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 27కు వాయిదా వేసింది.