: రూ.50 కోట్లిచ్చి కాపులను చంద్రబాబు అవమానించారు: సోము వీర్రాజు
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోమారు విరుచుకుపడ్డారు. ఏపీలో టీడీపీకి విజయాన్ని కట్టబెట్టిన కాపులను చంద్రబాబు అవమానించారని ఆయన ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన వీర్రాజు ఎన్నికల సమయంలో కాపులకు టీడీపీ ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. కాపుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తొలి విడతలోనే రూ.1,000 కోట్లు విడుదల చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసి టీడీపీ అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం పీఠం ఎక్కడం జరిగిపోయాయి. ఇచ్చిన హామీ మేరకు కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన చంద్రబాబు దానికి రూ.50 కోట్లను విడుదల చేశారు. ఈ అంశాన్ని ప్రస్తావించిన సోము వీర్రాజు, కాపులకు రూ.50 కోట్లు కేటాయించి సదరు సామాజిక వర్గాన్ని చంద్రబాబు అవమానించారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు కాపులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాపులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడానికి సన్నాహాలు చేస్తున్నారని, దీంతో చంద్రబాబు విపత్కర పరిస్థితులను ఎదుర్కోక తప్పదని అన్నారు. కాపుల సమస్యలను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు వీర్రాజు చెప్పారు.