: గెలుపు, ఓటమి సహజం... ఇంత దిగజారుడు ఆరోపణలా?: బాధేస్తుందన్న మోదీ
"ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. ఎన్నికల్లో ఒకరే విజయం సాధిస్తారు. మిగతావారంతా ఓడిపోవాల్సిందే. ఎన్నికల వేళ విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ, బీహారులో మహాకూటమి నేతలు నన్ను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న విమర్శలు చూస్తుంటే, రాజకీయాలు ఇంతగా మారిపోయాయా? అని బాధేస్తోంది. ఇంత దిగజారుడు ఆరోపణలు అవసరమా?" అని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశ్నించారు. బీహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ ఉదయం ఆయన గోపాల్ గంజ్ లో బహిరంగ సభను ఉద్దేశించి మోదీ ఉద్వేగంగా ప్రసంగించారు. బీహార్ యువత భవిష్యత్తు బాగుండాలన్నదే తన అభిమతమని మోదీ అన్నారు. తనపై ఆరోపణలు చేసి ఏం చేయలేకపోయిన నితీష్, లాలూ, ఇప్పుడు రాష్ట్ర ప్రజలపైనే విమర్శలు ఎక్కు పెట్టారని ఆరోపించారు. బీహార్ యువత వలస బాట పట్టడానికి కారణం ఎవరు? అని ప్రశ్నించిన ఆయన, తమ ప్రభుత్వం వస్తే, వలసలు ఉండవని, అందరికీ ఉపాధిని కల్పిస్తామని హామీ ఇచ్చారు. బీహార్ అభివృద్ధే అన్ని సమస్యలకూ పరిష్కారమని, తనపై నమ్మకం ఉంచితే, అవినీతిని అంతం చేసి చూపిస్తానని తెలిపారు. బీహార్ ప్రజా ప్రతినిధులు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ టీవీలకు చిక్కారని గుర్తు చేసిన ఆయన, ఇది నేరంగా ముఖ్యమంత్రి నితీష్ కు కనిపించడం లేదా? అని నిప్పులు చెరిగారు. అవినీతిపరులను పక్కన బెట్టుకున్న ఆయనకు తనను విమర్శించే హక్కు లేదని అన్నారు.