: అల్లుడు హీరో, మామ డెకాయిట్... పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
అతని పేరు బాలమురుగన్. అతని అల్లుడు సినీ హీరో. ఆయన ఓ చిత్రం ప్రారంభోత్సవానికి ఓ డీసీపీ స్థాయి అధికారి క్లాప్ కొట్టాడు కూడా. బాలమురుగన్ చేసేది మాత్రం బ్యాంకు దోపిడీలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు బ్యాంకులను దోపిడీ చేశాడు. వెంట తన భార్య, ఓ కుక్కతో కలసి ఇన్నోవా వాహనంలో వచ్చే బాలమురుగన్ నిపుణుడైన డ్రైవర్. పలుమార్లు చిటికెలో తప్పించుకున్నాడు. అతనికున్న వ్యాధి అతన్ని పోలీసులకు పట్టించింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సైబరాబాద్ పరిధిలో బ్యాంకుల్లో దొంగతనం చేసి తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బాలమురుగన్ కోసం గత జనవరి నుంచి పోలీసులు గాలిస్తున్నారు. కొంతకాలం క్రితం చెన్నైలో తన అనుచరుడు దినకర్ తో కలసి మేనల్లుడి ఫ్లాట్ లో వుంటున్నాడని తెలుసుకుని దాడి చేసేందుకు వెళితే, చిటికెలో పరారయ్యాడు. అతను ఉన్న ఫ్లాట్ లో తనిఖీలు చేయగా బాలమురుగన్ ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నట్టు తెలిసింది. దీంతో పోలీసులకు పెద్ద క్లూ చిక్కినట్లయింది. తన వ్యాధికి చికిత్స పొందేందుకు ఏదైనా ఆసుపత్రికి రావచ్చని భావించి అన్ని రాష్ట్రాల్లోని హెచ్ఐవీ కేంద్రాలకు సమాచారం, అతని చిత్రాలను పంపారు. తర్వాత కొన్నాళ్లకు కర్ణాటకలోని తిరువరూర్ చికిత్సా కేంద్రానికి వచ్చినట్టు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి బాలమురుగన్ ను అరెస్ట్ చేశారు.