: నెల రోజుల క్రితమే మేజర్ అయిన మధుప్రియ, శ్రీకాంత్ తో ప్రేమ ఎలాగంటే..!
తాను మేజర్ నని, తన పెళ్లిని తనకు ఇష్టమైన వాడితో చేసుకునేందుకు తల్లిదండ్రులు అడ్డుచెబుతున్నారని ఆరోపిస్తూ ...పోలీసు స్టేషన్ గడప తొక్కిన గాయని మధుప్రియకు సరిగ్గా నెల రోజుల క్రితమే 18 సంవత్సరాలు నిండాయి. దీంతో ఇంత చిన్న వయసులోనే పెళ్లేంటని ఆమె తల్లిదండ్రులు వాదిస్తున్నారు. కాగా, మధుప్రియ ప్రేమించిన శ్రీకాంత్ గురించి నల్లకుంట వాసులు భిన్న కథనాలు వినిపిస్తున్నారు. శ్రీకాంత్ నిర్మాణ రంగంలో వ్యాపారం చేస్తున్నాడని కొందరు చెబుతుంటే, లేదు... అతను ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగి మాత్రమేనని ఇంకొందరు అంటున్నారు. గతంలో శ్రీకాంత్ కొన్ని షార్ట్ ఫిలింలను తీశాడని తెలుస్తోంది. వీటిల్లో కొన్నింటిలో మధుప్రియ ప్రధాన పాత్రల్లో నటించిందని తెలుస్తోంది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టినట్టు సమాచారం. గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నప్పటికీ, తాను మేజర్ అయిన తరువాత మాత్రమే విషయం బయటపెట్టాలని ముందే మధుప్రియ నిర్ణయించుకుని ఆగినట్టు తెలిసింది. ఇప్పుడీ పెళ్లిని ఆపాలని మధుప్రియ తల్లిదండ్రులు, ఎలాగైనా తాము ఒకటి కావాలని ప్రేమజంట ప్రయత్నిస్తున్నాయి.