: సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటున్న 'బ్యూటీ' ఫోటో
ఇదొక అపురూపమైన దృశ్యం! నెత్తిన ధగధగలాడే కిరీటం, నడుముకు సిల్కు పట్టా, హైహీల్స్ తొడిగిన అందమైన యువతి రోడ్డుపక్కన చెత్తకుండీల చెంతన ఓ పెద్దావిడ కాళ్లకు నమస్కరిస్తున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఓ అందగత్తె రోడ్డుపక్కనున్న ఆవిడ కాళ్లకు మొక్కడం ఏంటనే సందేహం కలిగిందా? ఆమె ఆ సౌందర్యరాశిని కన్నతల్లి. ధాయ్ లాండ్ లో జరిగిన 'మిస్ అన్ సెన్సార్డ్ న్యూస్ ధాయ్ లాండ్-2015' పేరిట నిర్వహించిన అందాల పోటీల్లో విజయం సాధించిన కనిత్తా మింట్ ఫాసేంజ్ టైటిల్ గెలిచిన అనంతరం నేరుగా రోడ్డుపక్కన చెత్తను వేరు చేస్తున్న తల్లి దగ్గరకు వెళ్లి, ఆమె కాళ్లకు నమస్కరించింది. వీధుల వెంట తిరుగుతూ చెత్తను సేకరించి, దానిని వేరు చేసి రీ సైక్లింగ్ కి పంపిస్తూ తన తల్లి తనను చదివించిందని కనిత్తా తెలిపింది. అందాల పోటీకి ముందు తాను కూడా చెత్త సేకరణలో తన తల్లికి సహకరించేదానినని ఆమె వెల్లడించింది. అందాల పోటీల్లో విజయం సాధించడంతో టీవీ, సినిమాలలో నటించాలంటూ బోలెడన్ని అవకాశాలు వస్తున్నాయని, తనతో తన తల్లిని తీసుకువెళ్లి మంచి జీవితం ఇవ్వాలన్నది తన ఆశయమని, తన తల్లి అందుకు ఒప్పుకోవడం లేదని, తిండిపెట్టిన వృత్తిని ఓపికున్నంత కాలం చేస్తానని చెబుతోందని కనిత్తా ఆవేదన వ్యక్తం చేస్తోంది.