: హోదాపై అసలు సంగతి ప్రజలకు చెప్పండి: టీడీపీకి బీజేపీ ఎమ్మెల్యే సూచన
నీతి, నిజాయతీల గురించి తెలుగుదేశం నేతలతో చెప్పించుకునే అవసరం బీజేపీకి లేదని, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఫైరయ్యారు. బీజేపీ ఎటువంటి పార్టీయో ప్రజలకు తెలుసునని ఆయన అన్నారు. నేడు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ నేత బాబూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. తమ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గురించి ఏ మాత్రమూ తెలుసుకోకుండానే రాజేంద్రప్రసాద్ విమర్శించినట్టు తెలుస్తోందని అన్నారు. దేశం నేతల హితబోధలు తమకు అవసరం లేదని అన్న ఆకుల, రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై అసలు వాస్తవాలు ఏంటో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అధికార చంద్రబాబు సర్కారుదేనని అన్నారు. నిజాయతీ విషయంలో తమను విమర్శించే స్థాయి తెలుగుదేశం నేతలకు లేదని దుయ్యబట్టారు.