: ఎవరు కలిసినా చర్చ కేసీఆర్ 'చండీయాగం' పైనే... యాగం ఎలా ఉంటుందంటే!
భారత చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో డిసెంబర్ 23 నుంచి 5 రోజుల పాటు 'ఆయుత చండీయాగం'ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రధాన చర్చ. ఈ యాగాన్ని కేసీఆర్ ఎందుకు చేస్తున్నారు? దీని వల్ల వచ్చే ఫలితాలేంటని మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఆయుత చండీయాగం లక్ష చండీయాగాలతో సమానం. దీన్నే శతసహస్ర చండీయాగంగా కూడా పిలుస్తారు. ఇక ఒక చండీయాగం చేయడమంటేనే ఎంతో క్లిష్టతరం. లక్ష సాధారణ యజ్ఞాల ఫలాన్ని ఒక చండీయాగం ఇస్తుందని వేదాలు చెబుతున్నాయి. ఇక ఆయుత చండీయాగమంటే... లక్ష కోట్ల యజ్ఞాల ఫలం దరిచేరుతుంది. కరవు సహా పలు సమస్యలతో బాధపడుతున్న తెలంగాణ సుఖంగా ఉండాలన్న ఆకాంక్షతో కేసీఆర్ ఈ బృహత్తర యజ్ఞాన్ని తలపెట్టినట్టు ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. దేశం నలుమూలల నుంచి చండీయాగం చేయగల 1100 మంది వేదపండితులు, వివిధ పీఠాల అధిపతులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కేసీఆర్ ఫాంహౌస్ సమీపంలో యజ్ఞ వేదిక ఏర్పాట్లు జరుగుతున్నాయి. యజ్ఞ సమయంలో అగ్ని కోసం 10 టన్నుల మోదుగ పుల్లలు సిద్ధం చేస్తున్నారు. యాగం జరిగినన్ని రోజులూ నిత్యమూ 10 క్వింటాళ్ల నెయ్యి అవసరం కానుంది. చిన్న జీయర్ స్వామి నేతృత్వంలో జరిగే వేడుకలకు పలువురు ప్రముఖులు హాజరు కావచ్చని సమాచారం. చండీయాగాన్ని విజయవంతం చేయాలన్న కృతనిశ్చయంతో ఉన్న కేసీఆర్, ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీలను ఆహ్వానించిన సంగతి తెలిసిందే.