: ఇంకెంత కాలం ‘కొత్త రాష్ట్రం’ అని నెట్టుకొస్తారు?...టీ సర్కారుకు తలంటిన సుప్రీంకోర్టు


‘‘కొత్త రాష్ట్రమని ఇంకెంత కాలం నెట్టుకొస్తారు? ఇదే మాటను ఇంకెన్నాళ్లు చెబుతారు? ఉపాధ్యాయులు లేకుంటే స్కూళ్లు మూతపడవా? సమస్యలున్నాయని చెప్పి పిల్లల్ని ఇబ్బంది పెడతారా? విద్యను నీరుగారుస్తారా? ఇలాగైతే విద్యా హక్కు చట్టం ఎలా అమలవుతుంది?’’ అంటూ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తెలంగాణ సర్కారుకు తలంటింది. ఉపాధ్యాయ ఖాళీల భర్తీపై ఎప్పుడు విచారణ జరిగినా పాత వాదననే వినిపిస్తున్న తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులపై నిన్న సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవని జేకే రాజు అనే వ్యక్తి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రపుల్ల సి.పంత్ లతో కూడిన ధర్మాసనం పాఠశాలల్లోని వాస్తవ పరిస్థితులేంటో తేల్చాలని ఓ కమిటీని నియమించింది. పాఠశాలలను పరిశీలించిన సదరు కమిటీ తెలంగాణ పాఠశాల్లోని దుస్థితిని ధర్మాసనానికి నివేదించింది. దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినందున ఈ సమస్య పరిష్కారానికి కొంత సమయం పడుతుందని కౌంటర్ దాఖలు చేశారు. నిన్న జరిగిన విచారణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పాత వాదననే వినిపించేందుకు సిద్ధపడగా, ఇంకెంత కాలం కొత్త రాష్ట్రమని నెట్టుకొస్తారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మూడు వారాల్లోగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News