: ఈ సారీ ప్రధానితో ప్రత్యేక భేటీ కుదర్లేదు...కేంద్ర మంత్రులతో ఏకాంత చర్చలతో సరిపెట్టిన కేసీఆర్
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు తాజా ఢిల్లీ పర్యటన కూడా ఆశించిన మేర సాగలేదు. ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ కావాలని కేసీఆర్ యత్నిస్తూనే ఉన్నారు. అయితే ఎప్పటికప్పుడు ఆయనకు ప్రధాని అపాయింట్ మెంట్ లభించడం లేదు. నాలుగు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ దాదాపు మూడు రోజుల పాటు అక్కడే ఉన్నారు. ప్రధానితో ప్రత్యేక భేటీ లేకుండానే నిన్న సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాదు బయలుదేరారు. ఈ దఫా ఎలాగైనా ప్రధానితో ప్రత్యేకంగా భేటీ కావాలని, డిసెంబర్ లో తాను నిర్వహించనున్న ఆయుత చండీయాగానికి మోదీని ఆహ్వానించాలని ఆయన తలచారు. అయితే నీతి ఆయోగ్ కమిటీ సభ్యులతో కలిసి ప్రధానిని కలిసిన కేసీఆర్, మోదీతో ప్రత్యేక భేటీని మాత్రం సాధించలేకపోయారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్ లతో ఏకాంత చర్చలు జరిపిన కేసీఆర్, అంతటితోనే సంతృప్తి చెందక తప్పలేదు. మంగళవారం ప్రధాని నివాసానికి వెళ్లకముందే జైట్లీతో భేటీ అయిన కేసీఆర్, తన వెంట వచ్చిన వారినందరినీ బయటకు పంపి ఆయనతో పావు గంట పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. నిన్న కూడా రాజ్ నాథ్ సింగ్ వద్దకు తన ప్రతినిధి బృందంతో కలిసి వెళ్లిన కేసీఆర్ కొంతసేపు రాష్ట్ర విషయాలను చర్చించారు. ఆ తర్వాత ప్రతినిధి బృందాన్ని బయటకు పంపిన కేసీఆర్, రాజ్ నాథ్ తో 20 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చాయన్న విషయం తెలియరాలేదు.