: ఓటు హక్కును వినియోగించుకున్న అవిభక్త కవలలు
ఓటరు ఐడీ కార్డు ఒకటే. కానీ, ఆ కార్డుతో ఇద్దరు ఓటేశారు. వారే గత 19 ఏళ్లుగా ఒకరితో మరొకరు మమేకమై బతుకుతున్న అవిభక్త కవలలు సాబా మరియు ఫరా. ఈ రోజు బీహార్ లో జరిగిన మూడో విడత పోలింగ్ లో వీరు తమ ఓటు హక్కును వినియోగించుకుని పలువురికి మార్గదర్శకంగా నిలిచారు. పాట్నాలోని సమన్ పురా ప్రాంతంలోని పోలింగ్ బూత్ లో వారు ఓటు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకునే గొప్ప కార్యక్రమంలో తాము కూడా పాలుపంచుకోవాలనే కోరికతోనే ఓటు వేశామని చెప్పారు. ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి తమకున్న హక్కును వినియోగించుకున్నామని తెలిపారు. మరోవైపు, వీరిద్దరి వైద్య ఖర్చుల కోసం బీహార్ ప్రభుత్వం ఇస్తున్న ఇన్సెంటివ్ ను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రూ. 5 వేల నుంచి రూ. 20 వేలకు పెంచారు. మూడు నెలల క్రితం ముఖ్యమంత్రి జనతా దర్బార్ కు హాజరైన సాబా, ఫరాలు ఆయనకు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే ఆయన వీరి ఇన్సెంటివ్ ను పెంచారు. వీరి తండ్రి షకీల్ అహ్మద్ పాట్నాలోని ఓ రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్ నడుపుకుంటున్నారు. మరో విషయం ఏమిటంటే, ఆపరేషన్ నిర్వహించి వీరిద్దరినీ వేరు చేస్తే... ఒకరు మాత్రమే బతికి, మరొకరు చనిపోతారని డాక్టర్లు తెలపడంతో... వీరికి ఆపరేషన్ చేయరాదంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.