: 'క్యాండీ క్రష్' ఇన్విటేషన్స్ రాకుండా ఉండేందుకు ఏం చేయాలి?... జుకర్ బర్గ్ ను అడిగిన ఐఐటీ విద్యార్థి
ఢిల్లీలోని టౌన్ హాల్ లో ఐఐటీ విద్యార్థులు, అధ్యాపకులతో ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఇష్టాగోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ ఐఐటీ విద్యార్థి ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. తనకు క్యాండీ క్రష్ ఆట ఇన్విటేషన్స్ అస్సలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని ప్రశ్నించాడు. ఇందుకు జుకర్ స్పందిస్తూ, "ఇది చాలాకాలంగా టాప్ ఓటెడ్ క్వశ్చన్ గా ఉంది. నేను మరో సమావేశం నిర్వహించేలోగా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని మా డెవలపర్స్ కు చెప్పాను. వారు కూడా అదే పనిలో ఉన్నారు" అని తెలిపారు. ఫేస్ బుక్ నుంచి వచ్చిన ఈ క్యాండీ క్రష్ ఆట ఎంతో పాప్యులర్ అయింది. ఈ గేమ్ కు అలవాటుపడిన వారి నుంచి వచ్చే ఇన్విటేషన్లను భరించలేక అనేకమంది తమ ఫేస్ బుక్ ఫ్రెండ్ లిస్టు నుంచి వారిని తొలగించేస్తున్నారు.