: చోటా రాజన్ వారసుడు విక్కీ మల్హోత్రా...అదే జరిగితే దావూద్ కిందకే రాజన్ ఎంపైర్!
సంపన్నులను బెదిరించి డబ్బు వసూలు చేయడం, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా... ఇవే మాఫియా డాన్ చోటా రాజన్ చీకటి వ్యాపారాలు. ఈ తరహా కార్యకలాపాలతో వేలాది కోట్ల రూపాయాల చీకటి సామ్రాజ్యాన్ని అతడు నిర్మించాడు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కుడి భుజం చోటా షకీల్ దాడులతో బెంబేలెత్తిన చోటా రాజన్ తన మకాంను ఆస్ట్రేలియా నుంచి జింబాబ్వేకు మార్చేందుకు పక్కా ప్రణాళిక రచించుకున్నాడు. ఆస్ట్రేలియా నగరం సిడ్నీలో విమానం ఎక్కిన అతడు ఇండోనేసియా నగరం బాలి మీదుగా జింబాబ్వేకు చేరేందుకు పయనమయ్యాడు. అయితే ఆస్ట్రేలియా పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఇండోనేసియా పోలీసులు బాలిలో దిగిన చోటా రాజన్ ను అరెస్ట్ చేశారు. ఇక అతడు పోలీసుల కబంద హస్తాల నుంచి తప్పించుకోవడం అసాధ్యమే. మరి ఏళ్ల తరబడి అతడు నిర్మించిన సామ్రాజ్యం ఏం కావాలి? ఏమవుతుంది, అతడి అనుచరుల చేతిలోకి వెళ్లిపోతుంది. నిజమే, చోటా రాజన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న విక్కీ మల్హోత్రా చేతుల్లోకి ఈ చీకటి సామ్రాజ్యం వెళ్లిపోతోంది. ఇప్పటికే చోటా రాజన్ ఈ మేరకు విక్కీ మల్హోత్రాకు ఈ ప్రతిపాదన చేశాడట. ప్రస్తుతం రాజన్ పోలీసులకు పట్టుబడటంతో విక్కీ మల్హోత్రానే సదరు వ్యాపారాలకు అధిపతిగా మారనున్నాడు. ఇదే జరిగితే, భవిష్యత్తులో చోటా రాజన్ గ్యాంగ్ గానీ, అతడి సామ్రాజ్యం గానీ ఉండవట. ఎందుకంటే, విక్కీ మల్హోత్రా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడిగా మారిపోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. భారత కార్యకలాపాలకు సంబంధించిన డీ గ్యాంగ్ బాధ్యతలను అప్పజెప్పడం ద్వారా విక్కీ మల్హోత్రాను తన వర్గంలో చేర్చుకునేందుకు దావూద్ పావులు కదుపుతున్నాడని విశ్వసనీయ సమాచారం.