: కలసికట్టుగా ముందుకెళతారా?...ఎలిమినేట్ అవుతారా?: టీ టీడీపీ నేతలకు చంద్రబాబు క్లాస్
పార్టీ కార్యక్రమాలకు సంబంధించి వాగ్వాదానికి దిగి తన వద్దకు పంచాయతీకి వచ్చిన టీ టీడీపీ నేతలకు ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఓ స్థాయిలో క్లాసు పీకారు. నిన్న విజయవాడలో ఆయన టీ టీడీపీ నేతలకు దాదాపు మూడు గంటల పాటు తలంటారు. వివరాల్లోకెళితే... వరంగల్ ఉప ఎన్నికలపై చర్చించేందుకు ఇటీవల పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన భేటీ సందర్భంగా ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్ రెడ్డిల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ సమక్షంలోనే వారిద్దరూ తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగారని వదంతులు వినిపించాయి. దీనిపై సమాచారం అందుకున్న చంద్రబాబు విజయవాడకు వచ్చి తనను కలవాలని టీ టీడీపీ నేతలకు సూచించారు. ఈ క్రమంలో నిన్న రేవంత్ రెడ్డి అందరికంటే ముందుగానే విజయవాడకు చేరుకుని చంద్రబాబును ఆయన నివాసంలో కలిసి మొత్తం ఎపిసోడ్ ను వివరించారు. ఆ తర్వాత టీ టీడీపీ నేతలందరితో సమావేశమైన చంద్రబాబు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణ ప్రజల్లో అధికార టీఆర్ఎస్ పట్ల ఉన్న అసంతృప్తిని అనుకూలంగా మలచుకోవడంలో నేతలు వెనుకబడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కలిసి ఉంటేనే కలదు సుఖం అన్న సూత్రాన్ని ప్రస్తావించిన చంద్రబాబు ఇకనైనా కలసి ముందుకు సాగుతారా? లేక ఎలిమినేట్ అవుతారా? అని వారిని నిలదీశారు. ‘‘తెలంగాణలో అధికార పార్టీపై వ్యతిరేకత వస్తే ప్రత్యామ్నాయం మీరవుతారా? లేక ఎలిమినేట్ అవుతారా? అన్నది మీ పనితీరుపైనే ఆధారపడి ఉంది. మీరు కీచులాడుకుంటే అందరూ నష్టపోతారు. భవిష్యత్ అవకాశాలపై బెంగ వద్దు. ముందు ప్రజల్లో మీ ఇమేజ్ ను పెంచుకోండి’’ అని ఆయన వారికి క్లాస్ పీకారు.