: దళారుల చేతికి రైతు చిక్కకుండా చూడాలి: మంత్రి పరిటాల సునీత
దళారుల చేతికి రైతులు చిక్కకుండా చూసి, వారి నుంచి పకడ్బందీగా ధాన్యం సేకరించాలని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత సూచించారు. లెవీ కొనుగోళ్లపై రైస్ మిల్లర్లతో మంగళవారం ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, రైతులకు తప్పనిసరిగా మద్దతు ధర లభించాలన్నారు. సన్నబియ్యం ధరలు పెంచవద్దని ఈ సందర్భంగా మిల్లర్లను ఆమె కోరారు. దేశవ్యాప్తంగా కందిపప్పు ధరలు బాగా పెరిగాయని, కిలో కందిపప్పు ధర రూ.200 ఉన్నప్పటికీ రేషన్ కార్డు దారులకు రూ.50కే ఇస్తున్నామన్నారు. అదనంగా 33 వేల మెట్రిక్ టన్నుల కందిపప్పును కొనుగోలు చేసినట్లు చెప్పారు. కందిపప్పు అక్రమంగా నిల్వచేసి కృత్రిమ కొరత సృష్టించే వారిని సహించేది లేదన్నారు. కందిపప్పు అక్రమ నిల్వలు చేస్తున్న వ్యాపారులపై మరిన్ని దాడులు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. కందిపప్పు మిల్లర్లతో రేపు సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో తక్కువ ధరకే కందిపప్పును అందించే విషయమై చర్చిస్తానన్నారు. ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు, తదితర అంశాలపై రేపు నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి సునీత తెలిపారు.