: వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థిగా వివేక్?... అధిష్ఠానం పిలుపుతో ఢిల్లీకి పయనం


కాంగ్రెస్ కురువృద్ధుడు, దివంగత నేత జి.వెంకటస్వామి కుమారుడు, పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ వరంగల్ ఉప ఎన్నికల బరిలో దిగడం ఖాయంగానే కనిపిస్తోంది. గడచిన సార్వత్రిక ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ లో చేరిన ఆయన నెలల వ్యవధిలోనే తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. అయితే ఎస్సీ రిజర్వ్ డ్ అయిన వరంగల్ లోక్ సభ నుంచి ఆ సామాజిక వర్గంలో మంచి పట్టున్న వివేక్ ను తన అభ్యర్థిగా బరిలోకి దింపాలని టీఆర్ఎస్ పార్టీ శతథా యత్నించింది. అయితే గులాబీ నేతల అభ్యర్థనకు వివేక్ ససేమిరా అన్నారు. సొంత పార్టీని వీడేది లేదని, ‘కారు’ గుర్తుపై వరంగల్ ఉప బరిలో నిలిచేది లేదని కూడా ఆయన తెగేసి చెప్పారు. ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించిన కాంగ్రెస్ అధిష్ఠానం ఉన్నపళంగా ఢిల్లీకి రావాలని వివేక్ కు వర్తమానం పంపింది. దీంతో వివేక్ నేటి ఉదయం హస్తిన విమానం ఎక్కినట్లు సమాచారం. ఇదిలా ఉంటే, పార్టీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు పలువురు నేతల పేర్లతో జాబితా రూపొందించిన టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నేడు ఢిల్లీ వెళుతున్నారు. ఈ జాబితాలో వివేక్ పేరు కూడా ఉందని విశ్వసనీయ సమాచారం. అంటే, వరంగల్ ఉప బరిలో కాంగ్రెస్ తన అభ్యర్థిగా వివేక్ ను దింపడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది. ఇదే జరిగితే, వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ చెమటోడ్చక తప్పదు.

  • Loading...

More Telugu News