: ఢిల్లీలోని కేరళ భవన్ లో 'బీఫ్ కర్రీ'... ఉరుకులు, పరుగులు పెట్టిన పోలీసులు


"కేరళ భవన్ హోటల్ లో ఆవు మాంసంతో చేసిన కూరను వడ్డిస్తున్నారు. అక్కడి మెనూలో 'బీఫ్ కర్రీ' ఉంది" అని పోలీసు కంట్రోల్ రూంకు వచ్చిన ఫిర్యాదు పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. ఫోన్ చేసిన వ్యక్తి తాను హిందూ సేనకు చెందిన వ్యక్తినని కూడా చెప్పుకున్నాడు. అసలే దేశవ్యాప్తంగా గోవధపై చర్చ, గోవులను వధిస్తున్నారంటూ హత్యలు జరుగుతున్న వేళ, కేరళ రాష్ట్ర అధికార భవంతిలో జరగకూడనిది ఏదైనా జరుగుతుందన్న ఉద్దేశంతో బలగాలను అక్కడికి తరలించారు. హోటల్ సిబ్బందితో మాట్లాడారు. తాము ఆవు మాంసాన్ని విక్రయించడం లేదని 'బీఫ్ కర్రీ' పేరిట గేదె మాంసాన్ని వడ్డిస్తున్నామని, ఇదేమీ చట్ట వ్యతిరేకం కాదని హోటల్ సిబ్బంది తెలిపారు. తాము కేరళ భవన్ క్యాంటీనుకు వెళ్లి అక్కడి వారికి ఫిర్యాదు గురించి చెప్పామని ఎటువంటి శాంపిళ్లూ సేకరించలేదని ఓ పోలీసు అధికారి తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకూడదన్న ఉద్దేశంతో పోలీసులను కాపలాగా పెట్టామని అన్నారు. కాగా, తాత్కాలికంగా గేదె మాంసాన్ని కూడా మెనూ నుంచి తొలగించినట్టు కేరళ హౌస్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News