: టీడీపీ ఫోన్లకు పలకని గుండు సుధారాణి... ‘గులాబీ’ గూటికి చేరినట్టే!
‘గులాబీ’ గూటికి మరో టీడీపీ నేత చేరిపోయినట్టే. కేవలం ఒకే ఒక్క రోజులో జరిగిన మంతనాలు ఫలించిన నేపథ్యంలో టీడీపీ రాజ్యసభ సభ్యురాలు టీఆర్ఎస్ లో చేరిపోయేందుకు రంగం సిద్ధమైపోయింది. గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ హస్తిన పర్యటన ముగించుకుని వచ్చిన మరుక్షణమే సుధారాణి టీఆర్ఎస్ లో చేరిపోనున్నారు. ఇందుకు ఈ నెల 29 ముహూర్తం కూడా ఖరారైపోయినట్లు సమాచారం. నిన్న టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ తో గుండు సుధారాణి భేటీ కావడం, వెనువెంటనే ఆమె చేరికకు కేసీఆర్ పచ్చజెండా ఊపేయడం అంతా క్షణాల్లో జరిగిపోయాయి. టీఆర్ఎస్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన గుండు సుధారాణి ప్రస్తుతం టీడీపీ నేతల నుంచి వస్తున్న ఫోన్ కాల్స్ ను లిఫ్ట్ చేయడం లేదట. దీంతో ఆమె పార్టీ మారడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.