: కేసీఆర్ నాకంటే జూనియర్...అయినా ఇంటికెళ్లి పిలిచానుగా?: ‘అహంకారం’పై చంద్రబాబు క్లాసులు
అహంకారం పెరిగితే పార్టీకి తీరని నష్టం కలుగుతుందని టీడీపీ నేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చెబుతున్నారు. నష్టాన్ని నివారించాలంటే అహంకారాన్ని ఆమడదూరంలో ఉంచాలని ఆయన తన పార్టీ నేతలకు ఉద్బోధిస్తున్నారు. అయినా, ఉన్నట్టుండి ఈ క్లాసులేంటి అనేగా మీ అనుమానం? నవ్యాంధ్ర రాజధాని పరిధిలో భూముల రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఈ కారణంగా టీడీపీకి చెందిన ఆ ప్రాంత నేతల్లో క్రమంగా అహంకారం పెరుగుతోందట. విషయాన్ని పసిగట్టిన చంద్రబాబు, నష్ట నివారణ చర్యలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన ప్రతి నేతకు ‘అహంకారం’పై క్లాసులు పీకుతున్నారట. నిన్న విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలోనూ ఆయన ఈ తరహా క్లాసొకటి పీకారు. ‘‘మీ భూముల ధరలు ఇప్పటికే బాగా పెరిగాయి. కొంతమంది పార్టీ నేతలకు అహంకారం పెరిగిపోతోంది. మీ అహాలు తగ్గించుకొని అందరినీ కలుపుకెళ్లండి. కేసీఆర్ నాకంటే జూనియర్. ఎన్ని సమస్యలున్నా ఆయన ఇంటికి వెళ్లి నేరుగా నేనే శంకుస్థాపనకు రావలసిందిగా ఆహ్వానించి వచ్చా. అహంకారం తగ్గితే వ్యక్తిగతంగా మీకూ మంచిదే’’ అని చంద్రబాబు ఇచ్చిన సుదీర్ఘ క్లాస్ తో నేతలు ఆలోచనలో పడ్డారట.