: ఆ 'ఓవర్'ను నేను ఎన్నటికీ మర్చిపోలేను: సౌతాఫ్రికా బౌలర్ రబడా
భారత్ తో జరిగిన తొలి వన్డే చివరి ఓవర్ ను జీవితంలో మర్చిపోలేనని సౌతాఫ్రికా సీమర్ రబడా తెలిపాడు. హోరాహోరీగా జరిగిన తొలి వన్డేలో భారత్ విజయానికి చేరువైన దశలో కెప్టెన్ డివిలియర్స్ తనపై నమ్మకంతో బంతిని అందించాడని, ఆ నమ్మకాన్ని నిలబెట్టగలిగినందుకు తనకు ఎంతో తృప్తి కలిగిందని రబడా చెప్పాడు. 'అప్పటికి టీమిండియా విజయానికి 11 పరుగులు కావాలి. క్రీజులో ధోనీ ఉన్నాడు. ప్రపంచంలో మేటి ఫినిషర్ గా ధోనీకి ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. చిన్నప్పటి నుంచి ధోనీ ఆటతీరును చూస్తూ పెరిగిన నేను అతనికే బౌలింగ్ చేయాల్సి రావడంతో ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాను. అయితే అద్భుతమైన బంతులతో అతను పరుగులు సాధించకుండా చూడడమే నా లక్ష్యమని భావించాను' అని చెప్పాడు. కఠినమైన బంతులతో పరుగులను నియంత్రించిన తనకు బోనస్ గా ధోనీ వికెట్ కూడా లభించిందని రబడా సంతోషం వ్యక్తం చేశాడు. భారత్ లో భారత్ ను ఓడించడం ఎవరికైనా ఆనందదాయకమైన విషయమేనని చెప్పాడు. ఏమైనా, ఈ సిరీస్ లో ఆ ఓవర్ ను మాత్రం జీవితంలో మర్చిపోనని రబడా తెలిపాడు.