: చిన్న దొంగతనాల నుంచి బడా నేరాల వరకు... చోటా రాజన్ నేరజీవితం ఇదీ!
ముంబైలోని దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మాఫియా డాన్ చోటా రాజన్ అసలు పేరు రాజేంద్ర సదాశివ నికాల్జే. ‘నానా’ అని ముద్దుగా పిలుచుకుంటారు. ముంబైలో చిన్న చిన్న దొంగతనాలతో తన నేర జీవితాన్ని ప్రారంభించాడు చోటా రాజన్. ఆ తర్వాత బడా రాజన్ గా పేరుపొందిన రాజన్ నాయర్ గ్యాంగ్ లో చేరాడు. ఆ గ్యాంగ్ తరపున చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండేవాడు. బడా రాజన్ హత్యకు గురైన తర్వాత ఆ గ్యాంగ్ లీడర్ చోటా రాజన్ అయ్యాడు. కాలక్రమంలో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో చేయి కలిపాడు. బలవంతపు వసూళ్లు, హత్యలు, స్మగ్లింగ్, మాదక ద్రవ్యాల సరఫరా, సినిమాలకు ఫైనాన్సింగ్ వంటి పలు నేరాలకు చోటా రాజన్ పాల్పడ్డాడు. కేవలం ముంబైలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో పలు నేరాలకు రాజన్ పాల్పడ్డాడు. అతనిపై భారత్ లో 17 హత్య కేసులు ఉన్నాయి. దావూద్ తో చోటా రాజన్ విభేదాలకు ప్రధాన కారణం 1993 ముంబయి వరుస బాంబు పేలుళ్లు. దీనికి తోడు, దావూద్ నేర సిండికేట్ 'డీ కంపెనీ'కి చెందిన సత్య, చోటా షకీల్, శారదషెట్టిలు చోటా రాజన్ కు వ్యతిరేకంగా భిన్న కథనాలను దావూద్ కు చెబుతుండేవారు. దీంతో దావూద్ గ్యాంగ్ నుంచి చోటా రాజన్ బయటకు వచ్చేశాడు. దీంతో రెండు గ్యాంగ్ లు పరస్పరం తలపడుతుండేవి. దావూద్ నుంచి తనకు ప్రమాదం ఉందని భావించిన చోటా రాజన్ మలేషియాకు, ఆ తర్వాత దుబాయ్ కి తన మకాం మార్చాడు. చోటా రాజన్ భావించినట్లుగానే 2000 సంవత్సరంలో అతనిపై దావూద్ గ్యాంగ్ హత్యాయత్నానికి ప్రయత్నించింది. బ్యాంకాక్ లో ఓ హోటల్ లో ఉన్న చోటా రాజన్ పై దావూద్ అనుచరుడు చోటా షకీల్ కాల్పులకు పాల్పడ్డాడు. ఆ దాడి నుంచి చోటా రాజన్ తెలివిగా తప్పించుకుని బయటపడ్డాడు. దీనికి ప్రతీకారంగా 2001లో దావూద్ అనుచరులైన వినోద్ షెట్టి, సునీల్ సోన్ లను ముంబయిలో హతమార్చారు. కాగా, మాఫియా డాన్ చోటా రాజన్ ను ఈ రోజు ఇంటర్ పోల్ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.